గ్రామాభివృద్ధే లక్ష్యంగా సమిష్టిగా పని చేయాలి : మంత్రి పొన్నం
గ్రామాభివృద్ధే లక్ష్యంగా సమిష్టిగా పని చేయాలి : మంత్రి పొన్నం
Ponnam


కరీంనగర్, 29 ఏప్రిల్ (హి.స.) గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి అంశాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల ముల్కనూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. గతంలోనే మండల, జిల్లా స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలో నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని నాయకులకు సూచించారు.

జూన్లో ప్రారంభమయ్యే 'బడిబాట' కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని కోరారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులను అందిస్తోందని, గ్రామస్థులు కూడా తమ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “మీ బడి.. మీ బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. వచ్చే వర్షాకాలంలో గ్రామాల్లో విస్తృత స్థాయిలో మొక్కలునాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని తెలిపారు. ప్రతి మండలానికి ఒక మెడికల్ కాలేజీని దత్తతగా కేటాయించిన నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రతి వార్డులో బీఎల్ఎలను నియమించుకోవాలని సూచించారు. దొంగ ఓట్లు నమోదు కాకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande