
హైదరాబాద్, 29 ఏప్రిల్ (హి.స.)నగరంలో పెట్రోల్, డీజిల్ కోసం మంగళవారం వాహనదారులు మరోసారి పరుగులు పెట్టారు. ఒక బంకు వద్ద నుంచి మరో చోటుకు లగెత్తారు. మరోవైపు ఇంధనం ఉన్న బంకుల ఎదుట భారీ క్యూలు కట్టారు. ఒకరి నొకరు తోసుకుంటూ, పోటీపడుతూ వాహనాల్లో పెట్రోల్/డీజిల్ ఫిల్లింగ్ చేయించుకునేందుకు పడరాని పాట్లుపడ్డారు. నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారం గత ఆదివారం రాత్రి నుంచే ఊపందుకుంది. దీంతో వాహనదారులు లీటర్ల కొద్ది పెట్రోల్, డీజిల్ వాహనాల్లో నింపుకుంటుండడంతో నిల్వలు త్వరగా అయిపోయాయి. ఉన్న స్టాక్ గంటల్లోనే ఖాళీ అవుతుండడం, కొత్తగా తీసుకొచ్చిన ట్యాంకర్లలోని ఆయిల్ కూడా వెంటనే అయిపోతుండడంతో యజమానులు నో స్టాక్ బోర్డులు తగిలిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ కోసం తిరుగుతున్న కొంతమంది తమకు ఎక్కడైనా బంకుల్లో లభిస్తున్న వెంటనే తమ బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం చేరవేస్తున్నారు. తమ వాహనాల్లో ఫిల్లింగ్ చేసుకునే క్రమంలోనే వారిని కూడా బంకుల వద్దకు రప్పిస్తూ సాయం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, మంగళవారం పలు ప్రాంతాల్లో బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉండగా.. మరికొన్ని పూర్తిగా మూతపడ్డాయి. ఉదాహరణకు లంగర్హౌస్ రోడ్డులో వరుసగా ఉన్న మూడు బంకులు మూతపడగా.. ఫ్లై ఓవర్ కింద ఉన్న ఒకటి తెరిచి ఉంది. దీనికి ఉదయం 6 గంటలకు ట్యాంకర్ వచ్చి ఫిల్లింగ్ చేయగా.. 10.30 గంటలకే ఖాళీ కావడంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డు తగిలించారు. కాగా, సంఘం గుడి దగ్గర ఉన్న బంకులో సాయంత్రం వరకు ఖాళీ అయినట్లు తెలిసింది. నగర వ్యాప్తంగా 50 శాతం బంకులు మూతపడగా.. మరో 50 బంకుల్లో ఇంధనం లభించినట్లు వాహనదారులు తెలిపారు.
రద్దీని పట్టించుకోని పోలీసులు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా మార్చి 24న నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిన సమయంలో పౌరసరఫరా, రెవెన్యూ శాఖల అధికారులు, పోలీసులు హడావుడిగా చర్యలు చేపట్టారు. బంకుల వద్ద తోపులాటలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. తాజాగా రెండు రోజులుగా సమస్య ఉత్పన్నమైనప్పటికీ.. అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించడంలేదు. పలు చోట్ల పోలీసులు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉండగా, గచ్చిబౌలిలో సైబరాబాద్ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్ వద్ద 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పేట్బషీరాబాద్, కొంపల్లి, గాజుల రామారం, ఐడీపీఎల్, షాపూర్నగర్, దుండిగల్ తదితర ప్రాంతాల్లోని బంకుల వద్ద ఉదయం 6 గంటల నుంచి రద్దీ కనిపించింది. ముందుగా వచ్చిన వారు ఎక్కువ మోతాదులో ఫిల్లింగ్ చేసుకోవడంతో మళ్లీ కొరత ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్