
హైదరాబాద్, 29 ఏప్రిల్ (హి.స.)
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి జ్ఞాపకార్థం నిర్మించిన బ్యారక్ సిబ్బందికి స్ఫూర్తినిస్తుందని పోలీస్ కమిషనర్ గౌస్ అలాం పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన 'పోలీస్ స్మారక బ్యారెక్' ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల గౌరవార్థం ఈ బ్యారక్ను నిర్మించినట్లు తెలిపారు. అత్యంత తక్కువ సమయంలో నాణ్యమైన వసతులతో దీనిని పూర్తి చేశామన్నారు. పోలీస్ సిబ్బంది వసతి, సంక్షేమానికి ఈ భవనం ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు. నిర్మాణంలో చొరవ చూపిన హుజూరాబాద్ ఏసీపీ మాధవి, టౌన్ ఎహెచ్ కరుణాకర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న పోలీస్ స్టేషన్ల నిర్మాణంపై దృష్టి పెట్టామని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని సీపీ వెల్లడించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిందని, త్వరలోనే శాంతిభద్రతల కోసం అత్యాధునిక పోలీస్ భవనాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు