
అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.)
వ్యవసాయ శాఖలో పదోన్నతులపై రచ్చ మొదలైంది. గణాంక విభాగంలో పలువురు ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో అక్రమ పదోన్నతులు పొందారని, ఉప గణాంక అధికారి పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై కొందరు సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. అయితే సమాచారం ఇవ్వడానికి శాఖ ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో అక్రమ పదోన్నతుల కారణంగా తమకు అన్యాయం జరిగిందని, జిల్లాస్థాయిలో పనిచేసే సహాయ గణాంక అధికారులను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో పదోన్నతులతో నియమించారని విజిలెన్స్కు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. శాఖాధిపతి కార్యాలయంలోని ఉప గణాంక అధికారి పోస్టులను కేవలం పదవీకాల రికార్డు ప్రకారం భర్తీ చేయాల్సి ఉంది. అయితే సీనియారిటీ జాబితా, రోస్టర్ రిజిస్టర్లు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారంటూ తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఉప గణాంక అధికారుల నియామకంలో ఒకరిద్దరు ఉద్యోగులు తప్పుడు విద్యార్హత పత్రాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. దూరవిద్య ద్వారా ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్లు పెట్టి, పదోన్నతి పొందినట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదని విమర్శలున్నాయి. అక్రమ పదోన్నతులు, నకిలీ సర్టిఫికెట్ల విషయంలో అందిన ఫిర్యాదులపై శాఖాపరంగా విచారణ జరపాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.
వ్యవసాయ శాఖలో పదోన్నతుల అంశం ప్రహసనంగా మారింది. శాఖలో కొన్ని జాయింట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, డీడీఏల్లో సీనియర్లకు జేడీఏగా పదోన్నతి కల్పించాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పదోన్నతి పొందిన జేడీఏలను ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాకుండా వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఆగ్రోస్, మార్క్ఫెడ్లో ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి ఐదు జిల్లాల్లో ఏడీలు జిల్లా అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జేడీ కేడర్లో ఉన్న అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి పోస్టులో ఏడీ ఇన్చార్జిగా ఉన్నారు. చిత్తూరులో జేడీఏ పోస్టు ఖాళీగా ఉండగా, డీడీఏ ఇన్చార్జిగా ఉన్నారు. మన్యం, అనంతపురం, మార్కాపురం, పోలవరం జిల్లాల్లో జేడీ స్థాయి అధికారులు లేరు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ