ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలి : ఎమ్మెల్యే నాగరాజు
ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలి : ఎమ్మెల్యే నాగరాజు
Mla


వరంగల్, 29 ఏప్రిల్ (హి.స.)

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, టీచర్స్ కాలనీ, నక్కలపల్లి, వినాయక నగర్, రాంగోపాల్పురం ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం కలుగుతోందని స్థానిక ప్రజల ఫిర్యాదుల మేరకు బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులతో కలిసి పలువాటర్ ట్యాంకులు, బావులను పరిశీలించారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే సంబంధిత అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంహెచి, డీఈ, ఎఈ వాటర్ సప్లై విభాగం అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది సమన్వయంతో పని చేయకపోవడం పై అధికారులను నిలదీశారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా పనులు జరుగుతున్నాయని, నీటి సరఫరాలో అంతరాయం కలిగించడం ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భావన కలుగుతోందని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత అధికారుల పై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే నాగరాజు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande