కల్వకుంట్ల కుటుంబం ముందు ఆస్తి తగాదాలు పరిష్కరించుకోవాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కల్వకుంట్ల కుటుంబం ముందు ఆస్తి తగాదాలు పరిష్కరించుకోవాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Minister


పెద్దపల్లి, 29 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తుల పంచాయితీ పరిష్కరించుకున్న తర్వాత ప్రజా ప్రభుత్వం పై విమర్శలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం వ్యవసాయ మార్కెట్ లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. నంది మేడారం, చామనపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిగిపోవాలని.. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని హరీశ్ రావుతో పాటు కొత్తగా పార్టీలో చేరిన జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం ముందు ఆస్తుల పంచాయతీ పరిష్కరించుకున్న తర్వాత ప్రజా ప్రభుత్వంపై మాట్లాడాలని మంత్రి సూచించారు.

సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దిగిపోవాలని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు కవితకు పార్టీ పెట్టె అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. మొక్కజొన్న రైతులకు మద్దతు కల్పించాలని మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని రైతులు మద్దతు ధర పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించి చేతులు దులుపుకుంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. చామనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇరిగేషన్ శాఖ ద్వారా సంప్రదింపులు జరిపి కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద బోరుబావి తవ్వించడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామంలో అంబేద్కర్ భవనం ఏర్పాటు తోపాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande