కత్తి వాళ్లకిచ్చి, యుద్ధం మాత్రం మమ్మల్ని చేయమంటే ఎలా.? కేటీఆర్
కత్తి వాళ్లకిచ్చి, యుద్ధం మాత్రం మమ్మల్ని చేయమంటే ఎలా.? కేటీఆర్
Ktr


హైదరాబాద్, 29 ఏప్రిల్ (హి.స.)

ఎన్నికలు రాగానే ప్రజలు కన్ఫ్యూజ్ కావొద్దని, గందరగోళంలో ఓటేస్తే భవిష్యత్తు ఆగమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రాజకీయాల్లో అధికారం రావడం, పోవడం అనేది చాలా సాధారణమని, అది రొటీన్గా జరిగే ప్రక్రియేనని ఆయన వ్యాఖ్యానించారు. పాలమూరు బిడ్డను అని, ప్రజల గోస తీరుస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఈ రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి లేదా పాలమూరు ప్రాంతానికి ఏం చేశారో ప్రజలు లోతుగా ఆలోచించాలని కోరారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలనను బేరీజు వేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన కాంగ్రెస్ లాగా 420 అబద్ధపు హామీలతో ప్రజలను ఎప్పుడూ మోసం చేయలేదని కేటీఆర్ తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా రైతుల సంక్షేమం కోరి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, 11 విడతల్లో దాదాపు రూ.73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. గతంలో కొందరు నేతలు రైతుబంధు కేసీఆర్ తన ఇంట్లో నుంచి ఇస్తున్నారా అని హేళనగా మాట్లాడారని, మరి ఇవాళ రాష్ట్రంలో రైతుబంధు పరిస్థితి ఏమైందో వారు సమాధానం చెప్పాలని నిలదీశారు. కత్తి వాళ్లకిచ్చి, యుద్ధం మాత్రం మమ్మల్ని చేయమంటే ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎండగడుతూ, ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ. 6 లక్షలు ఇస్తామన్న మాట ఏమైందని కేటీఆర్ నిలదీశారు. విద్యార్థులకు 10వ తరగతి పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.12 వేలు డిగ్రీ పాసైతే రూ.లక్ష, పీజీ పాసైతే రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కాంగ్రెస్ సరిగ్గా నిర్వహించలేకపోతోందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఆరున్నర లక్షల మంది విద్యార్థుల కోసం లక్షల రూపాయల ఫీజులు ప్రభుత్వం చెల్లించిందని, కానీ నేడు ఆ ఫీజులు తల్లిదండ్రులే కట్టుకోవాలని కోర్టులు తీర్పునిచ్చే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande