
అమరావతి, 03 ఏప్రిల్ (హి.స.)
దిల్లీ: ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న తైలవర్ణ చిత్రం అరుదైన రికార్డు సృష్టించింది. వేలంలో రూ.167.20 కోట్లకు అమ్ముడైంది. బుధవారం ముంబయిలో ‘సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్’ను నిర్వహించారు. రవివర్మ చిత్రాన్ని దక్కించుకొనేందుకు అనేకమంది పోటీపడ్డారు. పారిశ్రామిక వేత్త, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ సైరస్ పూనావాలా దీన్ని దక్కించుకున్నారు. 1890లలో గీసిన ఈ చిత్రం మాతృప్రేమను ప్రతిబింబిస్తుంది. చిన్ని కృష్ణుడు పాలగిన్నెతో నిరీక్షిస్తుండగా, ఆవు పాలు పితుకుతూ యశోదమ్మ అద్భుతంగా కనిపిస్తుంటారు. గతేడాది ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన గ్రామ్ యాత్ర పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. అత్యంత ఖరీధైన భారతీయ కళాకృతిగా ఇప్పటివరకు ఇదే కొనసాగగా.. తాజాగా ఆ రికార్డును రవివర్మ చిత్తరువు బద్దలుకొట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ