
ఢిల్లీ, 03 ఏప్రిల్ (హి.స.)ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ యువనేత, ఎంపీ రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ అధిష్ఠానం తొలగించింది. ఈ నిర్ణయంపై రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. పార్లమెంటులో తన గొంతు నొక్కేందుకే ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.
నేను పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలను లేవనెత్తుతాను. బహుశా సాధారణంగా ఎవరూ ప్రస్తావించని అంశాలను నేను చర్చిస్తాను. కానీ, ప్రజా సమస్యలను లేవనెత్తడం నేరమా? నేను ఏదైనా తప్పు చేశానా? ఏదైనా పొరపాటు జరిగిందా? అని చద్దా ప్రశ్నించారు. రాజ్యసభలో రాఘవ్ చద్దాను మాట్లాడకుండా ఆపాలని పార్టీ సెక్రటేరియట్కు చెప్పినందునే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. మౌనంగా ఉన్నా, ఓడిపోలేదు అనే సందేశంతో ఈ వీడియోను విడుదల చేశారు.
గురువారం జరిగిన నాటకీయ పరిణామాల తర్వాత చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ఆయనకు మాట్లాడే అవకాశం (ఫ్లోర్ టైమ్) ఇవ్వవద్దని కోరుతూ పార్టీ ఆయనను డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చాయి. తనను మాట్లాడకుండా చేసేందుకే డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించారని, తద్వారా ఆయన తనకు తానుగా సమయం కేటాయించుకోలేరని చద్దా సన్నిహిత వర్గాలు తెలిపాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi