
బెంగళూరు, 30 ఏప్రిల్ (హి.స.)
కర్ణాటక రాజకీయాల్లో గత కొంత కాలంగా కొనసాగుతున్న సీఎం మార్పు ఊహాగానాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెరదించారు. కర్ణాటకలో ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మార్పు ఏదీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నాయకత్వ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆయన గురువారం స్పష్టం చేశారు.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు, కర్ణాటకలోని రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు మే4న వెలువడనున్నాయి. ఈ ఫలితాల అనంతరం కర్ణాటకలో సీఎం మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఖర్గే తాజా వ్యాఖ్యలు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నేటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం శివకుమార్కు శివకుమార్కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
అనుభవజ్ఞుడైన ఖర్గే కర్ణాటక ముఖ్యమంత్రి అయితే పార్టీలోని అందరూ స్వాగతిస్తారని కర్ణాకట హోంమంత్రి పరమేశ్వర బుధవారం వ్యాఖ్యానించారు. దీనిపై ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు (మీడియా), ఆయన (పరమేశ్వర), ప్రజలు అనుకోవచ్చు. కానీ నా తలరాత కంటే కూడా, నా సిద్ధాంతాలు, పార్టీకి నేను చేసిన సేవను బట్టి నా విషయంలో సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారు అని ఆయన తేల్చిచెప్పారు.
2025 నవంబర్ 20 నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలోనే నాయకత్వ మార్పులు చర్చలు, ఊహాగానాలు ముదిరాయి. ఇదిలా ఉండగా, వచ్చే నెలలో దాదాపు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిల్లీ టికెట్లు బుక్ చేసుకున్నారని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ, 'నాకు ఆ విషయం తెలియదు. ఆ వివరాలు ఏమిటో ఆయననే అడగండి' అని పేర్కొన్నారు.
కేరళ, తమిళనాడులో విజయం ఖాయం!
బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కూడా ఖర్గే స్పందించారు. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారం దక్కించుకుంటుందని అన్నారు. అలాగే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అసోం, పుదుచ్చేరి పరిస్థితేంటి?
కాగా, అసోం, పుదుచ్చేరిలో అధికార పక్షాన్ని గద్దె దించడం కాంగ్రెస్కు సవాలుతో కూడుకున్న విషయమని ఖర్గే అంగీకరించారు. అసోం ఎగ్జిట్ పోల్స్ మాకు తక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయి. కానీ అంచనాల కంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయనే నమ్మకం ఉంది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ-ఎన్ఆర్ కూటమితో మేము సమంగా పోరాడాం. అక్కడ గట్టి పోటీ నెలకొంది. మరి కొద్ది రోజులు వేచి చూడాలి అని ఆయన అన్నారు.
బంగాల్లో హోరాహోరీ
బంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉందని ఖర్గే అభిప్రాయపడ్డారు. మాకున్న సమాచారం ప్రకారం అక్కడ టీఎంసీ ఆధిక్యంలో ఉంది. అయితే కేంద్ర బలగాలను మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ మమతా బెనర్జీకి బీజేపీ గట్టి సవాల్ విసిరేందుకు ప్రయత్నించింది అని ఆరోపించారు. ఒక వేళ హంగ్ వస్తే టీఎంసీకి మద్దతు ఇస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని ఖర్గే పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi