‘వాట్సాప్ లో ఒప్పందం.. ఫోన్ పేలో చెల్లింపులు'.. ఏసీబీ అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు
వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు
ACB


వరంగల్, 04 ఏప్రిల్ (హి.స.) వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఏసీబీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ ఏజెంట్ల ద్వారానే జరుగుతున్నాయి. ఆన్ లైన్ లో స్లాట్లు బుక్ చేసుకున్నా రిజిస్ట్రేషన్లు మాత్రం ఒప్పందాల తర్వాతనే చేస్తున్నారు. ప్రతీ డాక్యుమెంట్ కు రేటు మాట్లాడుకున్న తర్వాతనే ప్రాసెస్ ను పూర్తి చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతీరోజు 86 వరకు డాక్యుమెంట్ టార్గెట్లు ఉండగా వీటిలో రిజిస్టర్ అయ్యే డాక్యుమెంట్లను బట్టీ రేటు మాట్లాడుకుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, ఏజెంట్లు ఇతర వారి ఫోన్ పేలను వినియోగిస్తూ డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది.

ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఏజెంట్లు ఎక్కువ మంది కార్యాలయంలోనే ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునే వారితో పాటు ఏజెంట్లు ఉండటంతో కార్యాలయానికి తాళాలు వేసి తనిఖీలు చేశారు. 20 మంది ఏజెంట్ల వద్ద రూ.47,450, మరియు 70 రిజిస్టర్ కాని డాక్యుమెంట్లను గుర్తించారు. డాక్యుమెంట్ల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్-1 జమాల్ పురం రామకృష్ణారావు, సబ్ రిజిస్ట్రార్-2 దేవులూరి ఆనంద్ ఫోన్లను పరిశీలించారు. ఒక సబ్ రిజిస్ట్రార్ ఫోన్ లో రూ.42లక్షల 3వేల 125 సంవత్సరం కాలంగా ఫోన్ పే జరిగినట్లు గుర్తించారు.

కార్యాలయంలో 204 రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు అసలైన వారికి ఇవ్వనట్లు గుర్తించారు. కార్యాలయం తనిఖీ తర్వాత గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం 10గంటల వరకు వారి ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. హన్మకొండతో పాటు ఖమ్మంలో ఉన్న ఇళ్లల్లో తనిఖీలు చేయగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల వద్ద రూ.24లక్షల 41 వేల 540, 819 గ్రాముల బంగారం,

2కిలోల 600 గ్రాముల వెండి ఆదాయానికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఇవే కాకుండా కపిల్ చిట్స్ ఫండ్ లో రూ.30లక్షల 10వేల విలువైన ఫిక్సిడ్ డిపాజిట్ బాండ్స్ పట్టుకున్నారు. ఈ రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించారు. నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande