
హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)*
అక్షయ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సీట్లు పొందిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను గౌరవించేందుకు శని వారం సైబరాబాద్ సీపీ కార్యాలయం ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ బి. శివధర్ రెడ్డి సైబరాబాద్ హెడ్ క్వార్టర్ లో పికిల్‌బాల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం ఆయన ఆటలో పాల్గొని కొంతసేపు ఆడారు.
ఈ కార్యక్రమానికి డీజీపీ బి. శివధర్ రెడ్డి, పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, అక్షయ విద్యా ఫౌండేషన్ చైర్మన్ జే. వివేక్ ఆనంద్, వ్యవస్థాపకుడు మరియు ఉపాధ్యక్షుడు టి. ప్రసాద్, వ్యవస్థాపకుడు మరియు ట్రస్టీ ఎస్. జనార్ధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు విద్యార్థులను అభినందిస్తూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్న ప్రతి విద్యార్థి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
*డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ* గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి విజయానికి కారణమైన తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నవారు అవసరం ఉన్నవారి కోసం కొంత భాగాన్ని కేటాయించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా ఎస్. జనార్ధన్ వారి కుమారుడు టి. ప్రసాద్ అక్షయ విద్యా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను ప్రశంసించారు. సమాజానికి ఇటువంటి ఫౌండేషన్లు ఎంతో అవసరమని, నాశనం కాని అక్షరానికి నాందిగా అక్షయ విద్యా ఫౌండేషన్ నిలుస్తోందన్నారు. అలాగే విద్య సరిగా లేని ప్రాంతాల్లో ప్రజల దృష్టి, ప్రభుత్వ దృష్టి తగ్గే అవకాశం ఉండటంతో పాటు నేరాల శాతం పెరిగే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో అక్షయ విద్యా ఫౌండేషన్ రాత్రి సమయాల్లో కూడా ట్యూషన్లు, స్టడీ అవర్స్ నిర్వహిస్తూ గత 16 సంవత్సరాలుగా నిరంతరం సేవలందించడం ప్రశంసనీయం అని చెప్పారు.
ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. టూ వీలర్‌పై ప్రయాణించే ప్రతిసారీ హెల్మెట్ ధరించడం భయంతో కాదు, బాధ్యతగా చేయాలని కోరారు. చాలామంది హెల్మెట్ ధరించినప్పటికీ స్ట్రాప్ బకిల్ (బెల్టు) పెట్టుకోకపోవడం వల్ల ప్రమాద సమయంలో అది జారి పోయి రక్షణ కలగడం లేదని వివరించారు. కాబట్టి హెల్మెట్‌తో పాటు స్ట్రాప్ బకిల్ కూడా ఖచ్చితంగా ధరించాలని సూచించారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అలవాటు కల్పించాలని కోరుతూ, సమాజానికి గొప్ప సేవ అందిస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్‌ను అభినందించారు.
*పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ మాట్లాడుతూ,* డీజీపీ శివధర్ రెడ్డి మరియు సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అక్షయ విద్యా ఫౌండేషన్‌కు అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు. సమాజంలోని చివరి అంచు వరకు విద్య చేరేలా చేయడానికి అక్షయ ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తోందని, ఈ సేవా కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు.
అక్షయ ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్న విద్యార్థులు మంచి భవిష్యత్తు సాధించి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్య మన జీవిత స్థితిని పూర్తిగా మార్చగల శక్తి కలిగినదని పేర్కొంటూ, అక్షయ విద్యా ఫౌండేషన్‌లో సీటు పొందడం ఒక గొప్ప అవకాశమని భావించి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
*అక్షయ విద్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ట్రస్టీ జనార్దన్ మాట్లాడుతూ,* ఒక చిన్న సెంటర్‌తో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 140 సెంటర్లుగా విస్తరించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నదని తెలిపారు. ప్రతి విద్యార్థికి విద్య హక్కు అనే నమ్మకంతో, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, ఆధునిక సాంకేతికతతో బోధన అందిస్తున్నామని చెప్పారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీతో సమన్వయం చేసి విద్యార్థులకు రవాణా సదుపాయాలు కల్పించడం కూడా ఫౌండేషన్ ముఖ్య కార్యక్రమమని పేర్కొన్నారు. ట్యూటర్లను నియమించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నామని తెలిపారు. ఈ అదనపు సదుపాయాలన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తూ, పేద విద్యార్థులకు నాణ్యమైన మార్గదర్శకత్వం ఇవ్వడం సంస్థ లక్ష్యమని చెప్పారు.
అక్షయ విద్యా ఫౌండేషన్‌కు సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అండగా నిలుస్తున్నారని, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఆయన వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని సహకరించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఆకలికి అన్నం, వస్త్రం ఇవ్వడం తాత్కాలిక సహాయం మాత్రమే కానీ, విద్య ఇవ్వడం జీవితాన్ని మార్చగల శక్తి కలిగినదని, ఒక వ్యక్తి చదువుకుంటే మూడు తరాల భవిష్యత్తు మారుతుందనే సంకల్పంతో సంస్థ పనిచేస్తోందని జనార్దన్ పేర్కొన్నారు.
అనంతరం డీజీపీ, విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా మెడల్స్ అందజేసి చేసి అభినందించారు. తదనంతరం, వారి విజయానికి అండగా నిలిచిన తల్లిదండ్రులను సాలువాలతో సత్కరించారు.
SCSC ద్వారా సమాజసేవలో భాగంగా వివిధ సంస్థలు వాహనాలను విరాళంగా అందించాయి. Novotel Hyderabad Convention Centre నుంచి 5 Hero Xoom బైకులు, Exel Rubber (P) Limited నుండి 2 Hero Xoom బైకులు అందించగా, మొత్తం 7 బైకులు, Harsco నుండి 2 Citroen electric cars, Azad Engineering నుండి 1 Citroen electric కారు అందించబడ్డాయి. మొత్తం 10 వాహనాలను బి. శివధర్ రెడ్డి గారి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అబిలాష బిస్త్, సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, రిటైర్డ్ డీసీపీ మురళీధర్ – AVF సభ్యుడు, AVF చైర్మన్ జె. వివేక్ ఆనంద్, AVF వ్యవస్థాపక మరియు ఉపచైర్మన్ టి. ప్రసాద్, AVF వ్యవస్థాపక మరియు ట్రస్టీ ఎస్. జనార్ధన్, AVF సభ్యురాలు (సంగమిత్రా పాఠశాల) జి. అరణ్యధి, AVF సభ్యుడు (హోండా ప్రైడ్) సురేశ్ రెడ్డి, AVF సభ్యుడు (ఫార్చ్యూన్ మోటర్స్) నీరవ్ మోది, మరియు AVF దాత (NV చారిటబుల్ ట్రస్ట్) CA శ్రీనివాసన్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు