
అమరావతి, 05 ఏప్రిల్ (హి.స.)అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాడేరు ఏజెన్సీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలు గిరిజన ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. గాఢ నిద్రలో ఉన్న జనం, భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. శనివారం రాత్రి 11:31 గంటల సమయంలో అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ప్రధానంగా పాడేరు, అరకు వ్యాలీ, హుకుంపేట, పెదబయలు మండలాల్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు సమాచారం. ప్రకంపనల ధాటికి పలు ఇళ్లలో సామాన్లు కింద పడిపోవడంతో జనం ఆందోళన చెందారు. దాదాపు 3 నుంచి 5 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వివరాల ప్రకారం..ఒడిశాలోని కోరాపుట్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4 గా నమోదైంది. భూ అంతర్భాగంలో సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయి.
సాధారణంగా కొండ ప్రాంతాల్లో ఇటువంటి ప్రకంపనలు వచ్చినప్పుడు కొండ చరియలు విరిగిపడతాయేమో అన్న భయం ప్రజల్లో నెలకొంది. అర్ధరాత్రి వేళ కావడంతో పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రజలు చలిని కూడా లెక్కచేయకుండా రోడ్లపైనే గడిపారు. అయితే ఎక్కడా ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV