
హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)
సింగరేణిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. డిపెండెంట్ కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కార్మికుల నియామకాలపై కాదు మీ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
ఇవాళ బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా సహజ వనరులను అక్కడి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రకృతి మనకు బొగ్గు వరంగా ఇచ్చింది. దీన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వాడేలా ప్రభుత్వం ఉండాలి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో... ఇప్పుడు అలాగే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు.
అప్పుడు మన తెలంగాణ వాళ్లు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయి అంటూ వెళ్లేవారు. మనకు తినటానికి తిండి లేని సమయంలో కార్మికులకు తిండి పెట్టిన సింగరేణిని మనం సిరులవేణి అని తలుచుకుంటాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి సింగరేణితో ఎలాంటి భావోద్వేగం లేదు. అందుకే కార్మికుల సమస్యలు వారికి తెలియటం లేదన్నారు. ౌ
బొగ్గు తీసుకొచ్చే వాళ్లు మన కార్మికులు. కానీ ఈ విషయం ఏమాత్రం తెలియని ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండటంతో వారికి మన కష్టాలు తెలియటం లేదన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం కొంతమందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నష్టపోయాం. అందుకే కొన్ని సడలింపులు ఇచ్చుకొని 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. దీంతో ఒక 20 వేల మంది భద్రతతో బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపించారు.
ఈ ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్న దానిపై ఎంక్వైయిరీ వేస్తారంట? వాళ్లకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చామన్న కారణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలుసుకోవటం లేదు. ఆనాటి గవర్నమెంట్ పాలసీ అది. దానిపై ఎలా ఎంక్వైరీ చేస్తారు? సింగరేణి తో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా బాగుపడలేదని సింగరేణి కార్మికులతో పెట్టుకోవద్దని భట్టిని నేను హెచ్చరిస్తున్నానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు