
అమరావతి, 05 ఏప్రిల్ (హి.స.)సూక్ష్మ సేద్యంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ (APMIP) అమలులో దేశంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం రికార్డు స్థాయిలో జరిగిందన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించినందుకు ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవడం ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. దీని ద్వారా 1.08 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిందని ఆయన తెలిపారు.
డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా నీటి పొదుపే కాకుండా.. ఖర్చు కూడా తగ్గుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. అంతేకాకుండా ఆధునిక సాగుతో పాటు అధిక దిగుబడి, లాభాలు సాధ్యమవుతాయని వివరించారు. టమాటా, ఆయిల్ పామ్, మిర్చి పంటలకు ప్రోత్సాహకమన్నారు. ఈ సూక్ష్మ సేద్యం పప్పు ధాన్యాల వరకు విస్తరించిందని వివరించారు. రైతులకు రూ.1,030 కోట్ల మేర సబ్సిడీ అందించినట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి రైతుకూ ఈ సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సూక్ష్మ సేద్యాన్ని మరింత విస్తరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్