
మావేలిక్కర, 05 ఏప్రిల్ (హి.స.)
కేరళంలో యూడిఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మాదిరిగానే ప్రజలకు ఇచ్చే ప్రతి హామీని కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మావేలిక్కర అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ముతర రాజ్కు మద్దతుగా ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని తెలిపారు. అదే విధంగా కేరళంలోకూడా యూడిఎఫ్ ప్రభుత్వం ఏర్పడితే ఐదు గ్యారెంటీలను ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేరళంలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎల్డీఎఫ్ పాలన ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక రంగాల్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేరళం ప్రజలు ఈసారి స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. పది సంవత్సరాల అసమర్థ పాలనకు ముగింపు పలికి, అభివృద్ధి, పారదర్శక పాలన కోసం యూడిఎఫ్కు అధికారం అప్పగించాలి” అని మంత్రి పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు