నిర్లక్ష్యపు ధోరణి సహించను.. కాంట్రాక్టర్లపై చంద్రబాబు సీరియస్.
రాజధాని అమరావతి పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి తీరాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు.
Chandrababu


అమరావతి, 05 ఏప్రిల్ (హి.స.)రాజధాని అమరావతి పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి తీరాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాణాలు చేస్తున్న కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, పలువురు అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. రాజధాని నిర్మాణానికి ఇసుక, గ్రావెల్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆజ్ఞాపించారు.

ఇసుక, గ్రావెల్ కొరతతో నిర్మాణ పనుల్లో జాప్యం జరగకూడదని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే, కృష్ణాజిల్లా అటవీ శాఖ అధికారుల వల్లే గ్రావెల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. అటవీ అధికారులతోనే అసలు సమస్య వస్తోందన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా అటవీశాఖ అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి అవసరమైన ఇసుక, గ్రావెల్ గ్రీన్ ఛానెల్ ద్వారా వెళ్లాలని ఆదేశించారు. మెటీరియల్ సరఫరాలో ఎవరి ఒత్తిళ్లకూ లొంగొద్దని హుకుం జారీ చేశారు. ఎవరైనా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

రాజధాని అమరావతి నిర్మాణ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలపైనా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థల తీరును తప్పుపట్టారు. నిర్మాణ సామగ్రికి రక్షణ కల్పించే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలకు లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని ఆగ్రహించారు. ఘటన తర్వాత కూడా కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులు సరిగా స్పందించలేదని మండిపడ్డారు. ప్రతి అంశాన్నీ వక్రీకరించేలా కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి కదా? అంటూ సున్నితంగా హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande