
అమరావతి, 05 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కొన్ని జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీస్తుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటమే ఇందుకు కారణమని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ ఆవర్తన ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. పిడుగుల ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మరోవైపు, రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV