ఇక డ్రైవింగ్ లైసన్స్ ప్రక్రియ మరింత కఠిన తరం
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసన్స్ ప్రక్రియను కఠినతరం చేసింది
ఇక డ్రైవింగ్ లైసన్స్ ప్రక్రియ మరింత కఠిన తరం


తెలంగాణ, 05 ఏప్రిల్ (హి.స.)

రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను కఠినతరం చేయనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర రవాణా శాఖ ఈ మేరకు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై లెర్నర్స్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) కోసం దరఖాస్తు చేసుకునే ముందే అభ్యర్థులు తప్పనిసరిగా రోడ్డు భద్రతపై ఆన్లైన్ అవగాహన పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న రెండంచెల విధానం (ఎల్ఎల్ఆర్, ఫైనల్ టెస్ట్) ఇకపై మూడంచెలుగా మారనుంది. ఇందులో భాగంగా, అభ్యర్థి మొదట ఆన్లైన్ రోడ్డు భద్రతా శిక్షణా కోర్సును పూర్తిచేయాలి. ఈ విధానంపై అధ్యయనానికి ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఏప్రిల్ నెలాఖరు నాటికి నివేదిక రాగానే దీన్ని తప్పనిసరి చేస్తామని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

ఈ ఆన్లైన్ శిక్షణ మొత్తం 3 గంటల నిడివితో, ఆరు మాడ్యూల్స్గా ఉంటుంది. ఇందులో వీడియో పాఠాలు, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అద్దాల సరైన వినియోగం, సురక్షితంగా ఓవర్టేకింగ్ చేయడం వంటి అంశాలతో పాటు, వాస్తవ ప్రమాదాల వీడియోలను చూపిస్తూ డ్రైవర్లు చేసే పొరపాట్లను వివరిస్తారు. అభ్యర్థులు ఇంటి నుంచే కెమెరా ఉన్న కంప్యూటర్ ద్వారా లేదా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో ఈ పరీక్ష రాయవచ్చు.

ఈ ఆన్లైన్ కోర్సు పూర్తి చేసిన వారికి ఒక యూనిక్ సర్టిఫికేట్ నంబర్ జారీ చేస్తారు. ఆ నంబర్తో మాత్రమే ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ఈ విధానం ద్వారా బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేయవచ్చని, రవాణా కార్యాలయాల్లో దళారీల ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకత పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులకు ప్రాధాన్యత ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande