
అమరాతి, 05 ఏప్రిల్ (హి.స.)
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ను చూస్తే తుగ్లక్ పాలన గుర్తొస్తోందని పార్థసారథి వ్యంగ్యాస్త్రాలు సంధించగా, విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
మంగళగిరిలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. తుగ్లక్ పేరు వినడమే తప్ప చూడలేదు. కానీ, జగన్ను చూస్తే ఆయనే గుర్తొస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో ఆయన మూడు ముక్కలాట ఆడారు. తాను చెప్పిందే అందరూ వినాలనే ధోరణి వల్లే ప్రజలు ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారు అని మండిపడ్డారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు రాజధానికి భూములు ఇచ్చారని, అలాంటి రైతులను అవమానించిన వైసీపీకి భవిష్యత్తులో పుట్టగతులుండవని హెచ్చరించారు.
మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతిపైనా, అమరావతిపైనా జగన్కు ఎందుకంత కక్ష? మొదట అమరావతిని రాజధానిగా అంగీకరించి, అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు అని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV