
కాకినాడ, 08 ఏప్రిల్ (హి.స.)
మసీదు సెంటర్ (కాకినాడ), కాకినాడ జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న సుమారు రూ.1,10,50,000 విలువజేసే 650 చరవాణులను పోలీసులు రివవరీ చేశారు. వాటిని జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధితులకు ఎస్పీ బిందుమాధవ్ చేతులమీదుగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ పోగొటుకున్న చరవాణులను తిరిగి పొందడానికి ‘మొబి ట్రాక్ కాకినాడ పోలీసు’ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రూ.6,48,27,000 విలువజేసే 4001 చరవాణులను బాధితులకు అందించామని వెల్లడించారు. ఫోన్ పోయిన వెంటనే 9490617852 నంబర్ వాట్సాప్నకు హాయ్ లేదా హలో అని మెసేజ్ పెడితే తాము వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్, జీపీఎస్ ట్రాకింగ్, ఐఎంఈఐ ట్రేసింగ్, సైబర్ నిఘా టూల్స్ వినియోగంతో ఆపరేషన్ మొబి ట్రాక్ విజయవంతమైందన్నారు. ఐటీకోర్ టీం ఉపయోగించిన ఎంఎంటీఎస్(మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్)తో ఫిర్యాదుల పరిష్కారంలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటపుడు జాగ్రత్తలు పాటించాలని, ఫోన్ బిల్లు, బాక్స్, ఫోన్ అమ్మే వ్యక్తి వివరాలు సరిగా పరిశీలించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ