అధికారులు వల్లే మా కార్యకర్తకు అన్యాయం జరిగింది: ఎంపీ బాలశౌరి
జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం నిర్మిస్తున్న ఇంటిని మచిలీపట్నం మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పందించారు
AP news


మచిలీపట్నం, 08 ఏప్రిల్ (హి.స.)జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం నిర్మిస్తున్న ఇంటిని మచిలీపట్నం మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పందించారు. కొబ్బరితోటలో శ్రీపతి వెంకటాచలం నిర్మిస్తున్న కట్టడాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(బుధవారం) బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ.. 'అధికారులు అత్యుత్సాహంతోనే మా కార్యకర్త శ్రీపతి వెంకటాచలంకు అన్యాయం జరిగింది. ఎంపీగా కాకుండా ఓ జనసేన కార్యకర్తగా శ్రీపతి వెంకటాచలంకు నేను అండగా నిలుస్తాను. కూల్చివేసిన ఇంటి స్థానంలో నా సొంత ఖర్చుతో మళ్లీ నిర్మాణం చేయిస్తాను. ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న సివిల్ వివాదాన్ని హ్యాండిల్ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఏకపక్ష నిర్ణయంతో అధికారులు మా కార్యకర్త ఇంటిని కూల్చి వేశారు. దీన్ని వైసీపీ వాళ్లు రాజకీయం చేయడం సిగ్గుచేటు. వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నట్టు మా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవు' అని ఆయన అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande