
అయినవిల్లి, 08 ఏప్రిల్ (హి.స.)
అయినవిల్లి, అంబాజీపేట, ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా అందులో భారీషెడ్ నిర్మించి కిరాయికి ఇచ్చిన ఓ వైకాపా నాయకుడి అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశాల మేరకే షెడ్డును తొలగించామని, ఘటనకు సంబంధించి వీఆర్వో కోలా సత్తిబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తహసీల్దార్ చదలవాడ విద్యాపతి, ఎంపీడీవో సరోవరరావు తెలిపారు.
వైకాపా మండలశాఖ అధ్యక్షుడు, కె.జగన్నాథపురానికి చెందిన మేడిశెట్టి శ్రీనుబాబు 15 సెంట్ల గ్రామకంఠం భూమిలో షెడ్డు నిర్మించారు. ఈ భూమికి సంబంధించి ఫోర్జరీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు కొందరు గ్రామస్థులు చేసిన ఫిర్యాదుతో గత నెల 25న అయినవిల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అమలాపురం ఆర్డీవో దర్యాప్తు చేపట్టి నిజమని తేల్చారు. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు నివేదిక ఇవ్వగా ఆయన ఆదేశాల మేరకు తహసీల్దార్ విద్యాపతి, ఎంపీడీవో సరోవరరావు, ఎస్సై జ్యోతి, రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్తు, అగ్నిమాపక శాఖ ఉద్యోగులు కలిసి పోలీసుల ఆధ్వర్యంలో కట్టడాలను కూల్చివేయించారు.
షెడ్ను కూల్చివేస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 10.30 గంటల సమయంలో పి.గన్నవరం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త గన్నవరపు శ్రీనివాసరావు వచ్చి రెండు రోజులు గడువుకావాలని కోరడంతో పాటు అడ్డుకున్నారు. పి.గన్నవరం, రావులపాలెం సీఐలు రుద్రరాజు భీమరాజు, విద్యాసాగర్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ