
తిరువనంతపురం, 09 ఏప్రిల్ (హి.స.)
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించనున్న
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) స్పందించారు. ఇవాళ తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)కు సంబంధించి ఇంకా అనేక అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఆ బిల్లుకు సంబంధించి డ్రాఫ్ట్ తమకు ఇంకా అందలేదని, అది రాకుండా దానిపై సమగ్రంగా మాట్లాడలేమని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ఏప్రిల్ 16న పార్లమెంట్ సమావేశాలను పిలవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు.
ప్రభుత్వం అసలు ఏం ప్రతిపాదిస్తోంది? దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? అనేది చూడాలన్నారు. ముఖ్యంగా సమాఖ్య వ్యవస్థ (Federalism), శాసనసభలు, పార్లమెంట్ పనితీరుపై ఈ బిల్లు ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్ (Parliament) సభ్యుల సంఖ్య 800 పైచిలుకు పెరుగుతుందా..? వారందరికీ మాట్లాడే అవకాశం లభిస్తుందా? వంటి సాంకేతిక మరియు ప్రాచీన అంశాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్లను సూత్రప్రాయంగా స్వాగతిస్తూనే, దాని అమలు తీరు తెన్నులపై విపక్షాలు లోతైన చర్చను కోరుతున్నట్లు థరూర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు