
ముంబై, 09 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో భారత నౌకాయాన రంగం అద్భుత విజయాన్ని సాధించింది. అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతంగా మారిన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) దాటుకుని, భారత జెండాతో ప్రయాణించిన 'గ్రీన్ ఆశా' (Green Asha) అనే ఎల్పీజీ నౌక గురువారం సురక్షితంగా ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) తీరానికి చేరుకుంది.
సుమారు 15,400 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) లోడ్తో వచ్చిన ఈ నౌకకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నవీ ముంబైలోని నవశేవా పోర్టులో ఉన్న బిపిసిఎల్-ఐఓసిఎల్ (BPCL-IOCL) లిక్విడ్ బెర్త్ వద్ద ఈ నౌక విజయవంతంగా లంగరు వేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత ఆ మార్గం గుండా ప్రయాణించి భారత్ చేరుకున్న మొట్టమొదటి భారీ గ్యాస్ నౌక ఇదే కావడం గమనార్హం.
ఈ సందర్భంగా జెఎన్పీఏ (JNPA) అధికారులు మాట్లాడుతూ.. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, దేశానికి అవసరమైన ఇంధన సరఫరాలో ఆటంకం కలగకుండా నౌకాయాన కార్యకలాపాలను నిర్వహించగలమని ఈ విజయం నిరూపించిందన్నారు. నౌకలోని సరుకుతో పాటు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో యుద్ధ భయాల వల్ల సరఫరా గొలుసు దెబ్బతింటున్న తరుణంలో భారత నౌక క్షేమంగా రావడం దేశ ఇంధన భద్రతకు ఊరటనిచ్చే అంశం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..