
మహారాష్ట్ర, 09 ఏప్రిల్ (హి.స.)
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతి ఉప ఎన్నికల పోటీ నుంచి కాంగ్రెస్ వైదొలిగింది. దీంతో దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఏకగ్రీవంగా గెలుపుకు మార్గం సుగమం అయింది. జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ మరణంతో బారామతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానం నుంచి అజిత్ పవార్ సతీమని సునేత్ర పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆకాశ్ మోర్ ను బరిలోకి దింపింది. ఈ నెల 23న జరగాల్సి ఉన్న పోలింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి తరపున ప్రచారం సైతం ప్రారంభించింది. అయితే అజిత్ పవార్ గౌరవార్థం పోటీ నుంచి తమ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తప్పుకుంటున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం ఎన్సీపీ చీఫ్ పార్టీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే, ఎమ్మెల్యే రోహిత్ పవార్ సహా ఎన్సిపి (ఎస్పి) నాయకులు ఉప ఎన్నికలో పోటీ చేయవద్దని తమ పార్టీకి మరోసారి విజ్ఞప్తి చేశారని ఈ నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సప్కల్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..