
కొమరం భీం ఆసిఫాబాద్, 01 మే (హి.స.)
ప్రాణహిత తీరం సీఎం రేవంత్ రెడ్డి
పర్యటనకు సిద్ధమవుతోంది. మే 07న సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడి హెట్టి పర్యటన ఖరారు కావడంతో జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టర్ కే.హరిత, ఎస్పీ నితిక పంత్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఉన్నతాధికారుల బృందం తుమ్మిడి హెట్టి వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించారు. సీఎం రాకకు సమయం తక్కువగా ఉండటంతో, అధికారులు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. హెలిప్యాడ్ నిర్మాణం నుంచి సభా ప్రాంగణం వరకు అన్నీ సజావుగా సాగాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతం కావడంతో భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా భద్రత విషయంలో ఎస్పీ నితిక పంత్ రాజీలేని పర్యవేక్షణ చేపట్టారు. నదీ తీర ప్రాంతం కావడంతో కట్టుదిట్టమైన బందోబస్తు ఉండాలని, ప్రతి పాయింట్ వద్ద నిఘా పెంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా రూట్ మ్యాప్ను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయించే మైలు రాయిగా నిలవనున్న కీలక పర్యటన అన్నారు. జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోందని... ప్రజలకు, రైతాంగానికి మేలు చేకూరేలా సీఎం పర్యటన సాగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు