మా నాన్న కెసిఆర్ ను నేను తిట్టలేదు.. క్లారిటీ ఇచ్చిన కవిత
మా నాన్న కెసిఆర్ ను నేను తిట్టలేదు.. క్లారిటీ ఇచ్చిన కవిత
Kavita


హైదరాబాద్, 02 మే (హి.స.)

తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త

రాజకీయ శక్తిగా 'తెలంగాణ రక్షణ సేన' (TRS) ఆవిర్భవించిందని, అన్ని వర్గాల రక్షణే ధ్యేయంగా ఈ వేదిక పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో 'సర్వోదయ తెలంగాణ' లక్ష్యంగా తమ పార్టీ ప్రయాణం సాగుతుందని స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడు అధర్మంపై యుద్ధం చేసేందుకు మోగించిన యుద్ధభేరి 'పాంచజన్యం' స్ఫూర్తితో.. ఐదు ప్రధాన అంశాలతో తమ మేనిఫెస్టోను రూపొందించినట్లు కవిత వెల్లడించారు. ఈ ఐదు అంశాలే తమ పార్టీకి ప్రాణవాయువు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రైవేట్ విద్యపైనే సామాన్యుడి ఆధారపడుతున్నారని, ఆదాయంలో 60 శాతం విద్య, వైద్యానికే ఖర్చవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వారికి కూడా వారు ఎంత వరకు చదువుతారో అంత వరకు పూర్తి ఉచిత విద్యను అందిస్తామని, దీనికి సంబంధించిన అన్ని ఆర్థిక లెక్కలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

క్యాన్సర్ వంటి మహమ్మారి సోకితే రూ.3 లక్షలు లేక ప్రాణాలు వదులుకుంటున్న కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయని కవిత అన్నారు. లైఫ్ స్పాన్ పెరగాల్సిన సమయంలో సరైన వైద్యం అందకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వచ్చాక ఎంత ఖర్చైనా సరే, ప్రభుత్వమే భరించి ప్రతి బిడ్డకు నాణ్యమైన వైద్యం అందిస్తుందని హామీ ఇచ్చారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు వదులుతున్నారని, మక్కా కుప్పపైనే రైతు చనిపోయిన ఘటన తనను కలచివేసిందని కవిత అన్నారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీముఖ్యమంత్రి కేసీఆపై తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన నేపథ్యంలో తన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. నేను మా నాన్నను విమర్శించలేదని రాజకీయ నాయకుడిగా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాత్రమే కెసిఆర్ ను విమర్శించాను తప్పితే మా నాన్న కేసీఆర్ ను నేను విమర్శించ లేదన్నారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన కవిత.. మా నాన్న కేసీఆర్ తో నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని, నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదన్నారు. ఓ హిందూ మహిళగా ప్రతిరోజు ఉదయం పూజ వేళలో స్మరించుకునే పేర్లలో తల్లిదండ్రుల పేర్లు కూడా ఉంటాయన్నారు.

నా తల్లిదండ్రులతో నాకు ఎలాంటి సమస్య లేదని, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో తనకు కచ్చితంగా ఐడియాలాజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయని ఈ విషయంలో మొన్న విమర్శించానని ఆయన తప్పు చేస్తే భవిష్యత్లోనూ విమర్శిస్తానని స్పష్టం చేశారు. నేను తప్పు చేస్తే బీఆర్ఎస్ వాళ్లు నన్ను విమర్శించవచ్చు. వ్యక్తిగతంగా కేసీఆర్ ను నేను ఒక్కమాట కూడా అనలేదు. తెలంగాణ ఏర్పడ్డాక వచ్చిన తొలి ప్రభుత్వం కొన్ని పనులు చేసి ఉంటే బాగుండేది. కృష్ణా, గోదావరి నదులను సరిగా వాడుకుని మన పొలాలకు నీళ్లు వచ్చి ఉంటే మన రైతులకు మేలు జరిగేది. కానీ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు రూ.1 లక్ష 21 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది మాత్రం కేవలం 1 లక్ష ఎకరాలకు మాత్రమే ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన యువకులకు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వలేమా? అన్ని దేశాలకు వెళ్లి స్పీచ్ లు ఇచ్చే కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఉండగా ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలన వల్ల రెండు తరాల యువకులు నష్టపోయారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande