
హనుమకొండ, 01 మే (హి.స.) విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో మార్చి 2026లో నిర్వహించిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఈ జిల్లాలోని 17 ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టాపర్ విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు. సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ ఎస్ఎస్సీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ విజయం జీవిత ప్రయాణంలో మొదటి మెట్టు మాత్రమేనని పేర్కొంటూ, తమ అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా భవిష్యత్తు కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా, స్వయంగా తమ లక్ష్యాలను నిర్ణయించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని అన్నారు. పట్టుదల, కృషిని ఇంటర్మీడియట్ చదువులో కూడా కొనసాగిస్తే మరింత ఉన్నత విజయాలు సాధించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలిచేలా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, ఏఎంఓ డా. బండారు మన్మోహన్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు