
జగిత్యాల, 01 మే (హి.స.)
జగిత్యాల జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల జాబితాలో స్థానం సంపాదించింది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన “దివ్య భారత్ పుస్తకంలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం లభించడం విశేషం. కొండల మధ్యలో పచ్చని ప్రకృతి సోయగాలతో నిండిన ఈ ఆలయం, హనుమంతుడి భక్తులకు ఆధ్యాత్మిక శక్తి ప్రసాదించే కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పురాణ గాధల ప్రకారం సంజీవని పర్వతంలోని ఒక భాగం ఇక్కడ పడిందని విశ్వాసం ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం, తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. దివ్య భారత్ పుస్తకంలో చోటు దక్కడం వల్ల ఆలయానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించనుంది. పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు తెరుచుకోవడంతో పాటు, కేంద్ర నిధులు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్థానిక ప్రజలు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆలయ అభివృద్ధికి ఇది మరింత ఊతమివ్వనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దివ్య భారత్ పుస్తకంలో చోటు దక్కించుకోవడం, తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకాత్మక గుర్తింపు. ఇది జిల్లా ప్రజలకు గర్వకారణం మాత్రమే కాకుండా, పర్యాటక రంగానికి కొత్త దారులు చూపనుంది.ఈ సందర్భంగా ఆలయ ఈవో అంజనా రెడ్డి మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దివ్య భారతి బుక్ లో చోటు సంపాదించుకోవడం సంతోషంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..