
ములుగు, 01 మే (హి.స.)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన ఉపాధి హామీ పథకం చట్టంతో నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతున్నదని, పాత చట్టం ద్వారానే కూలీ పనులను జరిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం ఉదయం వెంకటాపూర్ మండలం కేశపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాలలోని నిరుపేదలు పనుల కోసం వలసలు వెళ్లకుండా నివారించేందుకు 2006 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ పథకం పేరును జిరాంజీ గా మార్చి పేదలకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. కొత్త చట్టంలో ఫోటో రికగ్నేషన్ అమలు చేయడం వల్ల కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో 266 రకాల పనులు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కూలీలకు పనులు దక్కకుండా పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏకంగా కాంట్రాక్టర్లు సైతం పనులు చేయడానికి కొత్త చట్టంలో అవకాశం కల్పించారని, కూలీలు చేస్తున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం మండుతున్న ఎండల కారణంగా కూలీలు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకే పనులు చేయాలని, వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనుల వద్ద కూలీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజల దాహార్తి తీర్చేందుకు అన్ని గ్రామాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కూలీల భద్రతే తమ లక్ష్యమని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నూతన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని సీతక్క డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..