సెల్ఫ్ ఎన్యుమరేషన్లో బిగ్ ట్విస్ట్.. భద్రాచలం ఏపీలో చూపుతున్న వెబ్సైట్!
సెల్ఫ్ ఎన్యుమరేషన్లో బిగ్ ట్విస్ట్.. భద్రాచలం ఏపీలో చూపుతున్న వెబ్సైట్!
Bhadrachalam


భద్రాచలం, 01 మే (హి.స.)

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ప్రాంతం స్వీయ గణన వెబ్ సైట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లుగా చూపిస్తుండటం కలకలం రేపుతోంది. జన గణన ప్రక్రియలో భాగంగా తమ వివరాలను నమోదు చేసుకుంటున్న స్థానికులు, లోకేషన్ కాలమ్లో భద్రాచలం పేరును వెతకగా అది ఏపీ పరిధిలో ఉన్నట్లుగా రావడంతో అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం (Bhadrachalam), పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి చేర్చడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఐదు గ్రామాలు ఏపీలోకి వెళ్లినప్పటికీ, భద్రాచలం పట్టణం తెలంగాణలోనే ఉంది. కానీ, డిజిటల్ మ్యాపింగ్లో ఈ మార్పులు సరిగ్గా జరగకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది.

దీంతో బాధితులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. సర్వర్ అప్డేట్, జియోగ్రాఫికల్ డేటాలో ఉన్న లోపం వల్ల ఇలా జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. 2 రెండు రోజుల్లో ఈ సాంకేతిక సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని, భద్రాచలాన్ని తెలంగాణ పరిధిలోకి మారుస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. సాంకేతిక కారణాల వల్ల ఇలాంటి పొరపాట్లు జరగడం సాధారణమే అయినప్పటికీ, భద్రాచలం వంటి సున్నితమైన ప్రాంతం విషయంలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande