
పుట్టపర్తి, 01 మే (హి.స.)పుట్టపర్తిలోని ఓడిసి మండల కేంద్రంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో 140వ ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐఎఫ్టియు పతాకాన్ని జిల్లా నాయకులు పోరాటాల శ్రీరాములు ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో పోరాటాల శ్రీరాములు, మండల అధ్యక్షులు మంగరాజు నాగరాజు, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టుబడి గౌస్ లాజమ్ మాట్లాడుతూ యూరప్లో పారిశ్రామిక విప్లవం తర్వాత ఆధునిక కార్మిక వర్గం ఉద్భవించిందని, 1886లో జరిగిన పోరాటాల ఫలితంగా మే డే దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు వినోద్ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల సాధనలో మే డే ప్రాముఖ్యతను వివరించారు. శ్రమజీవుల ఐక్యతే వారి బలమని, ప్రస్తుత కాలంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తోందని, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు రూపొందిస్తూ వారికి కొమ్ము కాస్తోందని వినోద్ విమర్శించారు. ఈ విధానాలు కార్మికుల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV