
అమరావతి, 10 మే (హి.స.)
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృమూర్తులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. ప్రతి మనిషి జీవితం తల్లి ప్రేమతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
సమాజంలో తల్లి పాత్రను కొనియాడుతూ.. తల్లి చూపే ప్రేమ, త్యాగం, బిడ్డల పట్ల ఆమెకు ఉండే సంరక్షణ ఎంతో అమూల్యమైనవని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కరుణ, సహనం, ఆత్మస్థైర్యానికి తల్లులే అసలైన ప్రతిరూపాలని ఆయన కొనియాడారు. కేవలం కుటుంబ నిర్మాణంలోనే కాకుండా, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలోనూ తల్లుల పాత్ర అత్యంత కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మానవత్వాన్ని నిలబెట్టేది తల్లుల అంకితభావమేనని పేర్కొన్న సీఎం, మాతృమూర్తులందరికీ తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ ఎదుగుదలకు కారణమైన తల్లులను గౌరవించుకోవాలని ఆయన ఈ సందేశం ద్వారా గుర్తుచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ