
నిర్మల్, 13 మే (హి.స.)
జిల్లాలో ధాన్యం కొనుగోలు తరలింపు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. మొక్కజొన్న, వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన ధాన్యం గోదాములకు తరలింపు ప్రక్రియ పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే టోల్ ప్లాజాలు, చెకోపోస్టుల వద్ద ఖాళీ లారీలను గుర్తించి ధాన్యం తరలింపునకు వినియోగిస్తున్నామని తెలిపారు.
అవసరానికి అనుగుణంగా మరిన్ని లారీలు సమకూర్చుకోవాలని సూచించారు. లారీలు సమకూర్చే ప్రాంతాలు, అన్లోడింగ్ కేంద్రాల వద్ద రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ తదితర శాఖల సిబ్బందిని షిఫ్ట్ల వారీగా నియమించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం సంచులు నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే స్థానిక కూలీలను హమాలీలుగా నియమించుకోవాలని తెలిపారు. 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో అన్లోడింగ్ పాయింట్లు ఉన్న కేంద్రాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ గోదాములతో పాటు ప్రైవేట్ గోదాములు, రైతు వేదికలు తదితర ప్రాంతాల్లో కూడా ధాన్యం నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు