ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు: సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు: సీఎం రేవంత్ రెడ్డి
Cm


హైదరాబాద్, 10 మే (హి.స.)

వచ్చే విద్యా సంవత్సరంలో కొన్ని సంస్కరణలు చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలపై (Telangana Intermediate Admissions) ఏర్పడిన గందరగోళానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ను రద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 తరగతులు నిర్వహించాలని.. ఫలితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధుకులు s తర్వాత ఇంటర్మీడియట్కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. అప్పటితో చదువును నిలిపివేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ను వేరుగా కాకుండా 11,12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సైతం తన నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటర్మీడియట్లో ప్రవేశాలను నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో విలీనంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదరింపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande