
విశాఖపట్నం, 10 మే (హి.స.)
విశాఖపట్నంలో కైలాసగిరిని పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తామని, అందుకుగాను ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. కైలాసగిరిపై రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 65 అడుగుల ఎత్తైన త్రిశూలం, ఢమరుకాలను ఈరోజు ఉదయం ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనివల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. విశాఖలో ఈ త్రిశూలం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుందని తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో త్రిశూలం ప్రాజెక్టును పూర్తిచేసిన వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ కృషిని అభినందించారు. కైలాసగిరి అభివృద్ధికి ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని ఎంపీ శ్రీభరత్ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ