
అమరావతి, 10 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డుల్లో దేశవ్యాప్తంగా ఏపీ రెండో స్థానం సాధించింది. ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం స్పందించారు.. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలు సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామప్రజల సమష్టి కృషి వల్లే ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు. వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు సాధించిన గ్రామ పంచాయతీల్లో శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల పేర్లు నిలిచాయి. ఈ గ్రామాల సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబుకు పవన్ అభినందనలు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి కూడా పవన్ కల్యాణ్ మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ ప్రగతి కోసం సీఎం అందిస్తున్న సహకారం కీలకమని అన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ