
జోగులాంబ గద్వాల, 10 మే (హి.స.)
జోగులాంబ జిల్లాలోని గద్వాలమండలం పరుమాల స్టేజ్ సమీపంలో ఆదివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, అగ్నిమాపక వాహనాన్ని (ఫైర్ ఇంజన్) వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో అయిజ వైపు వెళ్తాంది. పరుమాల స్టేజ్ సమీపంలోకి రాగానే, ముందుగా వెళ్తున్న అగ్నిమాపక వాహనాన్ని బస్సు అదుపుతప్పి వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఢీకొన్న వేగానికి బస్సు ముందు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ హఠాత్పరిణామంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ అజాగ్రత్త కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోడ్డు పై నిలిచిపోయిన వాహనాలను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..