
సత్యవేడు, 10 మే (హి.స.)
ఇటివల సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రూ.2500 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ పరిశ్రమకు కావాల్సిన 276 ఎకరాల భూమికి సంబంధిం,ఇ సత్యవేడు మండలంలోని వా నెల్లూరులో 238.38 ఎకరాలు, రాళ్ళకుప్పం గ్రామంలో 42.38 ఎకరాలను కేటాయించనున్నారు.
రెవెన్యూ అధికారులు ఈ రెండు గ్రామాల్లోని డీకేటీ, ప్రభుత్వ భూములను ఇటీవల సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలను కూడా ఆమోదించారు. సత్యవేడు ప్రాంతంలో ఇప్పటికే చెరివి పంచాయతీ మాదనపాళెంలో ప్రపంచ బైక్ తయారీ దిగ్గజ సంస్థ హీరో పరిశ్రమ ఏర్పాటైంది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే హీరో కంపెనీకి భూములను కేటాయించి ప్రోత్సాహాలను అందించి పరిశ్రమను నెలకొల్పింది. ప్రస్తుతం సుమారు 3 వేల మంది ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.హీరో పరిశ్రమకు కూతవేటు దూరంలోనే వానెల్లూరు, రాళ్ళకుప్పం గ్రామాలుండడం విశేషం. రాయల్ ఎన్ఫీల్డ్ ఏర్పాటు జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి మరో మైలురాయి కానుంది.రాయల్ ఎన్ఫీల్డ్ రాక సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. టీడీపీ శ్రేణులతో పాటు స్థానిక యువత కూడా సోషల్ మీడియా వేదికగా తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.రెండు రోజులుగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సవారీ చేస్తున్నట్లు ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి..
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV