
హైదరాబాద్, 10 మే (హి.స.)
మరికాసేపట్లో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోత రోహిత్ను హౌస్ అరెస్ట్ చేశారు. అంబర్పేట్ నియోజకవర్గంలోనూ పలువురు కాంగ్రెస్ నేతలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
మరోవైపు ప్రధాని మోదీ రాకతో బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రయాణికులను సైతం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతిస్తున్నారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2:20 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అనంతరం తెలంగాణలో రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు, తదితరులు విమానాశ్రయం వద్దకు చేరుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi