
మహబూబాబాద్ , 10 మే (హి.స.)
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో వరంగల్-ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై ఆదివారం రైతులతో కలిసి మాజీ మంత్రి రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాలతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రెడ్యా నాయక్ మాట్లాడుతూ, రైతులు సంవత్సరం పొడవునా కష్టపడి పండించిన పంట వర్షాల వల్ల నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి రావడంతో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించి, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు