మర్రిగూడను రంగారెడ్డి జిల్లాలో విలీనం చేయాలి.. గ్రామస్తుల డిమాండ్
మర్రిగూడను రంగారెడ్డి జిల్లాలో విలీనం చేయాలి.. గ్రామస్తుల డిమాండ్
డిమాండ్


నల్గొండ, 10 మే (హి.స.)

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలాన్ని రంగారెడ్డి జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆదివారం చౌరస్తాలో ప్రజా కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు, రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం మర్రిగూడ మండలం నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల పనుల కోసం ప్రజలు దూరప్రయాణాలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల సమయం, డబ్బు వృథా అవుతుందని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా మర్రిగూడకు భౌగోళికంగా దగ్గరగా ఉండటంతో పాటు ప్రజల రాకపోకలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని నాయకులు అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో విలీనం జరిగితే ప్రభుత్వ పరిపాలనా సేవలు ప్రజలకు త్వరగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటిగా నిలిచిందని, హైదరాబాద్కు సమీపంగా ఉండటంతో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.మర్రిగూడ మండలం రంగారెడ్డి జిల్లాలో కలిస్తే భూముల ధరలు పెరిగే అవకాశముండడంతో రైతులు, భూమి యజమానులకు లకు ఆర్థిక లాభం కలుగుతుందని తెలిపారు. పరిశ్రమలు, కంపెనీలు స్థాపించబడితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుందని నాయకులు పేర్కొన్నారు. మర్రిగూడ మండల భవిష్యత్ అభివృద్ధి దృష్ట్యా రంగారెడ్డి జిల్లాలో విలీనం చేయడం అత్యవసరమని ప్రభుత్వాన్ని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande