
నెల్లూరు, 10 మే (హి.స.) నెల్లూరు జిల్లాలో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తు్న్నారు. వైసీపీ నేతల విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఆదివారం నెల్లూరులో మండిపడ్డారు. మహానాడు నిర్వహణ పూర్తిగా టీడీపీకి సంబంధించిన విషయమన్నారు. ఏడాదికి మహానాడుని ఒక్కో జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు.
గతంలో ఒంగోలు, రాజమండ్రి, విశాఖపట్నం, కడప జిల్లాలో ఈ మహానాడు నిర్వహించారని గుర్తు చేశారు. నెల్లూరులో ఇప్పటి వరకు జరపలేదన్నారు. తమ అభ్యర్థన మేరకు ఈ ఏడాది నెల్లూరులో మహానాడు నిర్వహిస్తున్నారని వివరించారు. దీనిపై ఇతరులు వాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణపై ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
దీనిపై జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఇప్పటికే కాకాణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ క్రమంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే నారాయణ కూడా కాకాణి వ్యాఖ్యలపై స్పందించారు. ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. అందుకు కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇఫ్కో కిసాన్ సెజ్లోని ఖాళీ స్థాలాన్ని వేదికగా ఎంపిక చేసింది. మే 27 నుంచి మూడు రోజుల పాటు ఈ మహానాడు నిర్వహిస్తారు. ఇవి మే 29వ తేదీతో ముగియనున్నాయి. ఈ మహానాడు ఏర్పాట్లపై పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే 21 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసిన విషయం విదితమే.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV