
తిరుమల 10 మే (హి.స.)సాధారణంగా వివాహం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడమో, తిరుమలలోనే శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవడమో చేస్తుంటారు చాలామంది. అయితే అలా వీలుకాని వాళ్లకు కూడా శ్రీవారి దైవాశీర్వాదం లభిస్తుంది. అది కూడా ఉచితంగా... ‘నవ వధూవరులకు శ్రీవారి అక్షింతలు’ పేరిట టీటీడీ గత కొన్నేళ్లుగా ఈ సేవను అందిస్తోంది. ఆ విశేషాలే ఇవి...
వివాహ బంధంలోకి అడుగుపెట్టే ప్రతీ జంట తమకు శ్రీ వేంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది. నూతన వధూవరులు స్వామి సన్నిధిని చేరుకుని తన్మయత్వం చెందుతారు. అయితే ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులతో అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కొత్త జంట కోటి ఆశలతో సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఎంతో విశిష్టమైన బంధానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంటుంది.
ఈక్రమంలోనే ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ) పెళ్లి చేసుకోబోయే ప్రతీ జంటకు ప్రత్యేకంగా పూజలు చేసిన పెళ్లి సామగ్రిని అందించేలా టీటీడీ 2007 జూన్ 30వ తేదీన ‘నవ వధూవరులకు శ్రీవారి అక్షింతలు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుమారు 19 ఏళ్లుగా ప్రతీ ఏడాది ‘శుభలేఖ’ పంపిన లక్షకుపైగా వధూవరులకు శ్రీవారి దీవెనలతో కల్యాణం జరుగుతోంది. టీటీడీ అందిస్తున్న ఈ సేవకు స్వామి భక్తుల నుంచి విశేష స్పందన ఉంది. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ వంటి రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన స్వామివారి భక్తులు ఈ సేవను వినియోగించు కుంటున్నారు. పెళ్లి శుభలేఖలను టీటీడీకి పంపుతున్నారు. శ్రీవారి అక్షింతలు అందుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV