
పెనుకొండ, :, 10 మే (హి.స.)
ఇంజినీరింగ్ పూర్తిచేసిన యువకుడు కుటుంబానికి అండగా ఉండాలని కలలుకంటూ కియా అనుబంధ పరిశ్రమలో ట్రైనీగా చేరి ప్రమాదవశాత్తు రోబో యంత్రానికి చిక్కి మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం ముతుకూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య, కుమారి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు రామాంజనేయులు(22) 6నెలల క్రితం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని కియా అనుబంధ పరిశ్రమ ఎన్వీహెచ్లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీగా ఉద్యోగంలో చేరాడు.
బీ షిఫ్ట్లో రోబో యంత్రం వద్ద పనిచేస్తుండగా అర్ధరాత్రి ప్రమాదవశాత్తు అది తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తోటి ఉద్యోగులు హుటాహుటిన కారులో పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అక్కడికి చేరుకునే లోపు మృతి చెందినట్లు నిర్ధారించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే లక్ష్మయ్య 15 ఏళ్లక్రితం భార్య మరణించినా, ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని బీటెక్ చదివించాడు. వృద్ధాప్యంలో తనకు ఆసరా ఉంటాడనుకున్న కుమారుడు మృతి చెందడంతో ఆ తండ్రి, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు వైద్యశాల వద్దకు చేరుకుని మృతుడి కుటుంబానికి పరిశ్రమ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులు పరిహారం చెల్లిస్తామని మాటివ్వడంతో సమస్య సద్దుమణిగింది. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కియా ఇండస్ట్రీయల్ ఏరియా పోలీస్స్టేషన్ ఎస్సై రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ