
అమరావతి, 11 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఈరోజు (సోమవారం) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. అలాగే, పలువురు కేంద్రమంత్రులను కలిసి ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తోసమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ సీఆర్ పాటిల్కు విజ్ఞప్తి చేశారు.
గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేసేలా చర్యలు..
2027 గోదావరి పుష్కరాల్లోపు ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే తాను స్వయంగా ఐదుసార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 2026 ఏప్రిల్ 2వ తేదీ నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందని, గ్యాప్ 1, గ్యాప్ 2లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి..
ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్లో ఉందనే కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని స్ఫష్టం చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దానికంటే కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్లు వివరించారు. ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర.. ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తి అయ్యాయని తెలిపారు. కాలువల సామర్థ్యం పెంచిన మేరకు నిధులను రీయింబర్స్ చేయాలని జలశక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
నిధులు మంజూరు చేయాలి..
పోలవరం ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి సీంచాయి యోజన కింద ఏపీలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునికీకరణకు నిధులు మంజూరు కోరుతూ లేఖ ఇచ్చారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునికీకరణ, కాలువల పూడిక తీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేయాల్సి ఉందన్నారు.సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయొద్దని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ