
అన్నమయ్య జిల్లా :, 11 మే (హి.స.)
జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని స్నేహితులు బైక్పై తీసుకెళ్లడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. చౌడేపల్లి మండలం ఎగువ మల్లెలవారిపల్లికి చెందిన వెంకటేశ్కు(30) గుండె నొప్పి రావడంతో స్నేహితులు అతన్ని బైక్పై చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంకటేశ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని భావించిన స్నేహితులు.. స్థానిక ఆటో డ్రైవర్లను అడిగారు. మృతదేహాన్ని తమ వాహనాల్లో తీసుకెళ్లడానికి ఆటో డ్రైవర్లు నిరాకరించారు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో స్నేహితులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎలాగైనా మృతదేహాన్ని ఊరికి చేర్చాలని భావించిన స్నేహితులు.. తమ బైక్పైనే వెంకటేశ్ డెడ్బాడీని ఎగువ మల్లెలవారిపల్లికి తీసుకెళ్లారు. ఆసుపత్రి నుంచి స్వగ్రామం వరకు బైక్పై మృతదేహాన్ని తీసుకెళ్లవలసి రావడం ఎంతో విషాదకరమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ