
అమరావతి, 11 మే (హి.స.)
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు(సోమవారం) ఢిల్లీలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి సమన్వయం చేస్తూ కాజా టోల్గేట్ సమీపాన నిర్మించిన వెస్ట్ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
విజయవాడ వెస్ట్ బైపాస్ NH - 16తో కలిసే చిన్నకాకాని జంక్షన్ వద్ద ప్రస్తుతం గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్చేంజ్ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పెమ్మసాని వివరించారు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు హైల్యాండ్ ఫ్లైఓవర్ కింద ఉన్న రెండు లైన్ల సర్వీస్ రోడ్, యూటర్న్ ద్వారా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడం, లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ