యావన్ హత్య కేసులో 10 మందిని అరెస్టు చేశాం: డీసీపీ రక్షిత
చిలకలగూడలో యావన్ హత్య కేసులో 10 మందిని అరెస్టు చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత వెల్లడించారు.
DCP Rakshitha


హైదరాబాద్, 11 మే (హి.స.)చిలకలగూడలో యావన్ హత్య కేసులో 10 మందిని అరెస్టు చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత వెల్లడించారు. ఈ నెల 7న జరిగిన ఈ హత్య కేసు వివరాలను ఆమె మీడియాకు వివరించారు. నిందితుల్లో 9 మంది.. మేజర్స్ కాగా.. ఒక మైనర్ బాలుడు ఉన్నాడని తెలిపారు. అమ్మాయి బావ సాయికిరణ్ ప్రోద్బలంతోనే హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య జరిగిందని చెప్పారు.

‘‘యావన్, అమ్మాయి స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ను హెచ్చరించారు. మాట వినకపోవడంతో హత్యకు ఐదు రోజుల ముందే నిందితులు ప్లాన్ చేసుకున్నారు. యావన్పై నిఘా పెట్టి, రెక్కీ నిర్వహించారు. అతడు స్నేహితుడి ఇంటి వద్ద ఉన్నట్లు తెలుసుకొని హత్య చేశారు. ఓ వ్యక్తి మొదట 16 నుంచి 17 సార్లు కత్తితో యావన్ను పొడిచాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లాం. యావన్ను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. నిందితులు వాడిన కత్తి, బైక్, మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నాం. సమగ్ర దర్యాప్తు జరిపి 10 మందిని అరెస్టు చేశాం. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. 19 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న యువకులు ఎక్కువగా హత్యల్లో పాల్గొని వారి భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. నగర యువత ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవద్దు. దురలవాట్లకు బానిసలు కావొద్దు’’ అని డీసీపీ రక్షిత తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande